Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘శేషాచలం’లో మళ్లీ గర్జించిన తుపాకులు... చుట్టుముట్టిన తమిళ కూలీలపై పోలీసుల కాల్పులు

తిరుమల వెంకన్న కొలువై ఉన్న శేషాచలం కొండల్లో తుపాకులు గర్జిస్తూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన పోలీసుల ఎన్ కౌంటర్ లో 20 మంది తమిళ కూలీలు చనిపోయిన నాటి నుంచి అక్కడ కాల్పుల శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా తమను చుట్టుముట్టిన తమిళ ‘ఎర్ర’ కూలీల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది గాల్లోకి కాల్పులు జరిపారు. కాల్పులతో భయభ్రాంతులకు గురైన ఎర్రచందనం కూలీలు కాళ్లకు బుద్ధి చెప్పారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం చీకటిగలకోన వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు తమిళ కూలీలు తారసపడ్డారు. దీంతో తమిళ కూలీలను నిలువరించిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారి వద్ద నుంచి 70 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో కూలీలు టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై దాడికి దిగే యత్నంలో భాగంగా రౌండప్ చేశారు. వేగంగా స్పందించిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది నాలుగు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో కూలీలు పరారయ్యారు.

More Telugu News